ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ ||2||
యేసయ్యా నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం ||2|| ||ఎడబాయని||
శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో – నిరాశ నిసృహలో ||2||
అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ ||2||
కృపా కనికరముగల దేవా
నా కష్టాల కడలిని దాటించితివి ||2|| ||ఎడబాయని||
విశ్వాస పోరాటంలో – ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో ||2||
దుష్టుల క్షేమమునే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ ||2||
దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి ||2|| ||ఎడబాయని||
నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని ||2||
భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగ ||2||
ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి ||2|| ||ఎడబాయని||